టీమిండియాకు వన్డే సిరీస్‌కి ముందు గట్టి ఎదురుదెబ్బ

వన్డే సిరీస్‌కి ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ

ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌ గెలిచి వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతోన్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా మరో ఇద్దరు ఆటగాళ్లు వన్డే, టీ-ట్వంటీ సిరీస్‌కు దూరమవనున్నారు. చెన్నై టెస్టులో గాయపడిన అక్షర్ పటేల్, ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో గాయం కారణంగా జట్టుకు దూరమయిన జయంత్ యాదవ్ వన్డే, టీ-ట్వంటీ సిరీస్‌కు దూరమవనున్నాడు. ఇప్పటికే షమి, రహానే, రోహిత్ గాయాల కారణంగా జట్టుకు దూరమయిన విషయం తెలిసిందే. టెస్ట్‌ సిరీస్‌ గెలుపులో కీలకపాత్ర పోషించిన అశ్విన్‌, జడేజాలు వన్డే సిరీస్‌‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఇంగ్లండ్‌తో జనవరి 15న ఆరంభం కానున్న వన్డే సిరీస్‌కు ప్రధాన స్పిన్నర్లు అశ్విన్‌, జడేజాకు కూడా విశ్రాంతి నివ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్టు తెలిసింది.

అశ్విన్‌, జడేజాలు మిస్‌ అయితే.. అమిత్ మిశ్రా స్పిన్‌ విభాగానికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ కేదార్‌ జాదవ్‌, మిగతా పార్ట్‌టైమ్‌ స్పిన్నర్లు మిశ్రాకు తోడుగా భారాన్ని పంచుకోనున్నారు. గాయం కారణంగా వన్డేలకు దూరమైన పేసర్‌ షమి స్థానంలో ఇషాంత్ శర్మను తీసుకోనున్నట్టు తెలిసింది. వెటరన్‌ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా పేరును కూడా పరిశీలించనున్నారు. వరల్డ్‌ టీ20లో నెహ్రా అద్భుతంగా రాణించాడు. కానీ గాయం కారణంగా న్యూజిలాండ్‌ సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకుంటున్న బ్యాట్స్‌మన్‌ రోహిత్ శర్మ స్థానంలో శిఖర్‌ ధవన్‌కు అవకాశం రావచ్చు. ట్రిపుల్‌ సెంచరీ వీరుడు కరుణ్‌ నాయర్‌ను కూడా వన్డేలకు ఎంపిక చేయనుండగా.. కేఎల్‌ రాహుల్‌ను ఓపెనర్‌గా పరిశీలించనున్నారు. ధోనీ సారథ్యంలో ఇంగ్లండ్‌తో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నారు. అయితే ప్రాక్టీస్‌ కోసం ఇంగ్లండ్‌తో జరగబోయే వార్మప్‌ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానని ధోనీ.. బోర్డుకు సమాచారం అందించినట్టు బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

 

Leave a Reply