కిలో చికెన్‌ రూ.900, గుడ్డు రూ.45

కిలో చికెన్‌ రూ.900, గుడ్డు రూ.45

బ్రాయిలర్‌ చికెన్‌ ధర నేల చూపులు చూస్తుంటే… మధ్యప్రదేశ్‌కు చెందిన ‘కడక్‌నాథ్‌’ అనే ప్రత్యేక జాతి కోడి మాంసం ధర మాత్రం జోరుగా పెరుగుతోంది. హైదరాబాద్‌లో ఈ కోడి మాంసం కిలో రూ.900కు హాట్‌ కేకులా అమ్ముడవుతోంది. బిగ్‌బాస్కెట్‌ వంటి ఆన్‌లైన్‌ సైట్స్‌లోనూ చాలా కాలంగా ఈ కోళ్ల అమ్మకం జరుగుతోంది. కోడి, మాంసం, ఎముకలు నల్లగా ఉండటమే ఈ కోడి ప్రత్యేకత. బ్రాయిలర్‌ కోళ్ల లాగా ఈ కోళ్ల పెంపకం కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరం లేదు. రాగులు, జొన్నలు, సజ్జలు వంటి వాటిని దాణాగా పెట్టొచ్చు. ఫారాల్లో పెంచే కోళ్లతో పోలిస్తే వీటికి వ్యాధి నిరోధక శక్తి ఎక్కువే. కాబట్టి ఎలాంటి మందుల అవసరం ఉండదు. అంతరించే దశకు చేరిన కడక్‌నాథ్‌ కోళ్ల పెంపకాన్ని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహిస్తోంది. ఈ కోళ్ల మాంసంలోని ప్రత్యేక ఔషధ గుణాల గురించి దేశ వ్యాప్తంగా ప్రచారం మొదలుకావడంతో ఇపుడు తమిళనాడుతో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో వీటి విక్రయాలు, పెంపకం ప్రారంభమైంది.

పోషకాలూ ఎక్కువే
బ్రాయిలర్‌ చికెన్‌తో పోలిస్తే కడక్‌నాథ్‌ చికెన్‌లో పోషకాలూ ఎక్కువని అంటున్నారు. కొవ్వు అతి తక్కువగా ఉండి మాంసకృత్తులూ ఎక్కువగా ఉండడంతో మార్కెట్‌లో కడక్‌నాథ్‌ మాంసానికి డిమాండ్‌ ఏర్పడింది. ఈ చికెన్‌ తినడం ద్వారా జీర్ణశక్తితోపాటు వ్యాధి నిరోధక శక్తీ పెరుగుతుందన్న భావన ఉంది. వీటి జీవిత కాలం ఎనిమిదేళ్లు. మామూలు కోళ్లు 45 రోజుల్లో 2.5 కిలోల బరువు పెరుగుతాయి. కడక్‌నాథ్‌ కోడి మాత్రం ఆరు నుంచి ఏడు నెలల్లో ఒకటిన్నర కిలోల బరువు మాత్రమే పెరుగుతుంది. దేశీయ నాటుకోడి తరహాలోనే దీని పెరుగుదల ఉంటుంది. ఈ కోడి మాంసంలో ఉన్న ఔషధ గుణాలను పరిశీలించి… క్రీడాకారుల డైట్‌ చార్ట్‌లో చేర్చాలని దేశ మాంస పరిశోధన సంస్థ సిఫారసు చేసింది. ఈ జాతి కోడి గుడ్డును రూ.45కు, ఒకరోజు వయసున్న పిల్లను రూ.150కి కొనడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు.

చిన్న రైతులకు అనుకూలం
వ్యాధుల భయం లేకపోవడం, మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండడంతో చిన్న చిన్న రైతులకు ఈ కోళ్ల పెంపకం లాభసాటిగా మారింది. దీంతో కొంత మంది ఔత్సాహికలు కూడా మధ్య ప్రదేశ్‌ నుంచి ఈ కోడి పిల్లలను తెచ్చి ఫారాల్లో పెంచుతున్నారు. పెంచేందుకు కొద్దిగా ఎక్కువ కాలం పట్టినా… వ్యాధుల భయం లేకపోవడంతో ఈ కోళ్ల పెంపకంలో పెద్దగా నష్టాలు వచ్చే అవకాశం లేదని నిపుణులు సూచిస్తున్నారు. గ్రామాల్లోని చిన్న, సన్నకారు రైతులుకు సబ్సిడీపై ఈ కోడి పిల్లలను అందిస్తే అదనపు ఆదాయం అందించినట్లవుతుంది.

Leave a Reply