కొడాలి నానికి చెక్ పెట్టేందుకు టీడీపీ పక్కా ప్లాన్ !

కొడాలి నానికి చెక్ పెట్టేందుకు టీడీపీ పక్కా ప్లాన్ !

గుడివాడ రాజకీయం రసకందాయంగా మారనుంది. గత కొంత కాలంగా గుడివాడలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను ప్రొటోకాల్‌ ఇన్‌చార్జిగా నియమించడం చర్చనీయాంశంగా మారింది. గుడివాడ ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)ని రాజకీయంగా ఎదుర్కొనేందుకు టీడీపీ పకడ్బందీ వ్యూహ రచన చేస్తోంది. గతంలో ఎమ్మెల్యే నాని కార్యాలయం ఖాళీ చేయించిన వ్యవహారంలో వివాదం చోటు చేసుకోగా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న గుడివాడ వచ్చి టీడీపీకి అండగా నిలిచారు. శనివారం మున్సిపల్‌ చైర్మన్‌పై వైసీపీ వర్గాలు దాడికి దిగడం, టీడీపీ శ్రేణులు ధీటుగా తిప్పికొట్టడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. గత ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళడం, తదుపరి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే నాని వ్యవహారశైలి వివాదాస్పదంగా తయారైంది. ఈ క్రమంలోనే శనివారం నాటి మున్సిపల్‌ హాల్‌లో సంఘటన ఆయనకు మైనస్‌గా మారింది.

టీడీపీ వర్గాలు ఒకతాటిపైకి వచ్చి వైసీపీ ఆగడాలను నిరోధించేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రొటోకాల్‌ ఇన్‌చార్జిగా బుద్దా వెంకన్నను నియమించినట్లు తెలుస్తోంది. ప్రోటోకాల్‌ ప్రకారం జన్మభూమి కార్యక్రమంలో ఎమ్మెల్యే నాని పాల్గొనాల్సి ఉంది. ఆయనతోపాటు చైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు కూడా పట్టణంలో జరిగే జన్మభూమి కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించక తప్పదు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గతంలో చైర్మన్‌ యలవర్తి వైసీపీలో ఉన్నప్పుడు ఆటంకాలు ఎదురయ్యాయి. ఆయన టీడీపీలోకి వెళ్ళడంతో పట్టణాభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరవుతున్నాయి. ఫలితంగా రెండవతేదీ నుంచి జరిగే జన్మభూమి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ దృష్ట్యా జన్మభూమి కార్యక్రమాలు వివాదాలకు అతీతంగా నిర్వహించేందుకు బుద్దా వెంకన్నను ప్రొటోకాల్‌ ఇన్‌చార్జిగా నియమించినట్లు సమాచారం.

గుడివాడపై టీడీపీ అధిష్టానం గురి
గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నానిని కట్టడి చేసేందుకు టీడీపీ అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పార్టీని నియోజక వర్గస్థాయిలో పటిష్టపరిచే దిశగా చర్యలు చేపట్టింది. ఆప్కాబ్‌ చైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వరరావు టీడీపీలో చేరడంతో నియోజకవర్గ పరిధిలోని నందివాడ మండలంలో టీడీపీ పూర్తిగా బలపడింది.

గుడివాడ రూరల్‌ మండలంలో గుత్తా శివరామకృష్ణ(చంటి) తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్ట్‌ కమిటీ చైర్మన్‌గా నియమితులవ్వడం వలన అక్కడ కూడా పార్టీకి నూతనోత్సాహం వచ్చింది. గుడ్లవల్లేరు మండలంలో ఆది నుంచే పార్టీ బలంగానే ఉంది. మరో వైపు ఆ మండలంలో కీలకంగా వ్యవహరించే సిఎల్‌ వెంకట్రావును స్వచ్ఛ భారత మిషన్‌ వైస్‌ చైర్మన్‌గా నియమించడంతో పార్టీ మరింత పటిష్టపడింది. ఇదే క్రమంలో వైసీపీ ఆయా మండలాల్లో పూర్తిగా బలహీన పడింది. కేవలం కొడాలి నాని తన వ్యక్తిగత ప్రాబల్యంతో ముందుకెళ్ళడం మినహా, పార్టీ పరంగా బలం శూన్యం. ఇటీవల కాలంలో గుడివాడ పట్టణంతోపాటు నియోజక వర్గంలోని ఆయా మండలాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ గూటిలో చేరిపోయారు.

ఇక అభివృద్ధి మంత్రంతో వైసీపీని మరింత బలహీన పరిచేందుకు అధిష్టానం దృష్టి పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటికే గుడివాడ పట్టణంలో పెద్ద ఎత్తున సిమెంట్‌రోడ్ల నిర్మాణం, డ్రెయిన్ల నిర్మాణం జరుగుతోంది.
త్వరలోనే కొత్త మున్సిపల్‌ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుడివాడ రానున్నారు. మున్సిపల్‌ కార్యాలయ ప్రారంభ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు టీడీపీ శ్రేణులు సమా యత్తమవుతున్నారు.

Leave a Reply