తప్పిపోయిన చిలుకను ఫేస్‌బుక్ పట్టించింది

తప్పిపోయిన చిలుకను ఫేస్‌బుక్ పట్టించింది

అల్లారుముద్దుగా పెంచుకున్న చిలుక తప్పిపోవడంతో ఫేస్‌బుక్ పట్టిచ్చిన విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగర సమీపంలోని బేతుల్ జిల్లాలో జరిగింది. బేతుల్ జిల్లాలో మదన్ మోహన్ సమర్ డీఎస్పీగా పనిచేస్తున్నాడు. 11 ఏళ్ల క్రితం ఓ హోంగార్డు ఓ చిట్టి చిలుకను డీఎస్పీకి బహుమతిగా ఇచ్చాడు. అంతే నాటి నుంచి డీఎస్పీ సమర్ దంపతులు ఆ చిలకమ్మకు ‘టున్ను’ అని పేరు పెట్టి తమ కుటుంబంలో ఓ సభ్యురాలిగా అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ నెల 4వతేదీన ఉన్నట్టుండి ‘టున్ను’ చిలుక తప్పిపోయింది. దీంతో ఆందోళన చెందిన సమర్ తన పెంపుడు చిలుక తప్పిపోయిందని ఆచూకీ తెలిస్తే చెప్పండంటూ సదరు డీఎస్పీ తన ఫేస్ బుక్ పేజీలో తమతో ఉన్న చిలుక ఫోటో పెట్టడంతోపాటు స్థానిక పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడు. సమర్ పెట్టిన ఫేస్ బుక్ పోస్టింగుపై 88 మంది షేర్ చేశారు. దీంతోపాటు 750 మంది స్పందించారు. ఎట్టకేలకు ఫేస్ బుక్ చూసిన ఓ పాన్ షాపు యజమాని టున్ను చిలుకను చూశానని శుక్రవారం సమర్ కు సమాచారమందించాడు. దీంతో చిలుక ప్రేమికుడైన సమర్ హుటాహుటిన పాన్ షాపు యజమాని చెప్పిన ప్రాంతానికి వెళ్లాడు. అంతే సమీర్ ను చూడగానే టున్ను చిలుక కాస్తా రెక్కలు టపటపలాడిస్తూ యజమానిని గుర్తించింది. తప్పిపోయిన చిలుక దొరకడంతో సమర్ కుటుంబసభ్యులు ఆనందపడ్డారు.

Leave a Reply