నేను ఎవరినో ఉద్ధరించడానికి ఇక్కడకు రాలేదు: సన్నిలియోన్‌

నేను ఎవరినో ఉద్ధరించడానికి ఇక్కడకు రాలేదు: సన్నిలియోన్‌

మొన్న పోర్న్‌ స్టార్‌, నిన్న హాట్‌ స్టార్‌, నేడు స్టార్‌లకే స్టార్‌…ఇదీ సన్నిలియోన్‌ సినీ ప్రస్థానం. చుట్టం చూపుగా బాలీవుడ్‌కి వచ్చిన సన్నీ చాలా తక్కువ కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా గుండెల్లో రైళ్లు పరిగెత్తెంచే స్థాయికి చేరుకుంది. ఆమె ఖాతాలో బ్లాక్‌ బస్టర్లు లేవేమో కానీ, అట్టర్‌ ఫ్లాపులకు మాత్రం చోటు లేదు. కేవలం ఆమె కోసమే సినిమాకు వెళ్లే అభిమానులున్నారు అంటే సన్నీ ఏ స్థాయిలో ప్రేక్షకులను ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్‌లో నెమ్మదిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న సన్నీ ‘రాయీస్‌’ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. షారూఖ్‌ ఖాన్‌ నటించిన ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌తో తన అభిమానులకే కాదు మొత్తం సినీ అభిమానులకు సైతం కనువిందు చేయనుంది. అలనాటి జీనతని గుర్తుకు తెచ్చేలాగా సాగిన ఆ పాట గురించి సన్నీ మాటల్లోనే….

‘రాయీస్’లో ‘లైలా మై లాలా’ పాట గురించి..
ఈ సినిమాలో ఈ పాటకు డ్యాన్స్‌ చేయడం నా అదృష్టం. నా జీవితంలో జరిగిన మధురమైన సంఘటన ఏదైనా ఉంది అంటే ఈ పాటకు నేను డ్యాన్స్‌ చేయడమే! జీవితంలో మరిచిపోలేని అనుభూతి ఇది. ఈ పాట గురించి దర్శకుడు రాహుల్‌ డోలాకియా నన్ను అడిగినప్పుడు ఒక్క క్షణం సందేహించాను. ఎవరినో అడగాలనుకుని నా దగ్గరకు వచ్చారేమో అన్న అనుమానం వచ్చింది. నా గురించే వచ్చానని స్పష్టంగా చెప్పారు. అయినా ఎక్కడో చిన్న సందేహం ఉండేది. కాస్ట్యూమ్‌ ట్రైల్స్‌ జరుగుతున్నప్పుడు కూడా ఈ పాట నేను చేస్తానా లేదా అని అనుమానపడుతూనే ఉండేదాన్ని. అన్నీ పూర్తి చేసుకుని ప్రాక్టీసు చేస్తున్నప్పుడు కూడా సందేహం కలుగుతూనే ఉండేది. చివరికి ఈ పాటకు నన్ను కాకుండా వేరేవారిని తీసుకుంటారేమో అని భయం కలిగేది. ఆ భయంతోనే ప్రాక్టీసుకి వెళ్లేదాన్ని. ఈ సాంగ్‌ నేను చేశానంటే ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకంటే షారూఖ్‌ ఖాన్‌ లాంటి హీరో సినిమాలో చిన్న పాట కానివ్వండి, నేను చేయడమా? అంతే కాదు జీనత గారు గొప్ప డ్యాన్సర్‌. ఆవిడ చేసిన పాటకు నేను స్టెప్పులు వేయాలి. ఇది సాధ్యమేనా? ఇన్ని సందేహాలు కలిగేవి. ఈ పాట చిత్రీకరణ పూర్తి కావడంతో నా సందేహాలన్నీ తీరాయి. నా అదృష్టం కొద్దీ పాటలో ఆవిడ వేసిన స్టెప్పులు కాకుండా కొత్తవి కంపోజ్‌ చేశారు. పాట మాత్రమే తీసుకున్నారు కానీ, డ్యాన్స్‌ అంతా డిఫరెంట్‌గానే ఉంటుంది.

షారూఖ్‌తో చేస్తానని అనుకున్నారా?

ఆయనతో చేయాలని ఇక్కడికి వచ్చినప్పటి నుంచీ కలలు కంటున్నాను. కానీ అది ఇంత త్వరగా నెరవేరుతుందని మాత్రం అనుకోలేదు. ఆయన ఎక్కడా, నేను ఎక్కడా? మొదటి రోజు షూటింగ్‌లో ఆయనని చూసి ఉద్వేగం ఆపుకోలేకపోయాను. ఏడవాలనిపించింది. అది సమయం కాదని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. తొలి రోజు షూటింగ్‌లో ఉద్వేగంగానే గడిపాను. తరువాత తరువాత అలవాటు పడిపోయాను. ఇప్పటి యువతకు ఒకటే చెబుతున్నాను. కలలు కనండి. కానీ వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడే జీవితంలో అభివృద్ధి చెందుతారు. దానికి నేనే పెద్ద ఉదాహరణ. కష్టపడితే ఫలితం తప్పకుండా లభిస్తుంది.

ఈ పాటకు ఇంత గుర్తింపు వస్తుందని ముందే ఊహించారా?

పాట చాలా ఫేమస్‌ కాబట్టి మంచి గుర్తింపే వస్తుందని అనుకున్నాను. కానీ ట్రైలర్‌నే కొన్ని లక్షల మంది చూశారంటే సినిమాని ఇంతకన్నా గొప్పగా ఆదరిస్తారన్న నమ్మకం కలిగింది. నా నమ్మకం వమ్ము కాదు. ఈ సినిమా సక్సె్‌సలో తప్పకుండా నాకూ భాగం ఉంటుంది.

బాలీవుడ్‌లో ఇంత మంది హీరోయిన్లు ఉండగా ఈ అవకాశం మీకే ఎందుకు వచ్చిందంటారు?

నిజమే. ఇక్కడ బాగా డ్యాన్స్‌ చేసే హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వాళ్లని కాదని ఎక్కడి నుంచో ముంబయి వచ్చిన నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారంటే అది దర్శక నిర్మాతలది, హీరో గొప్పతనమే తప్ప నేను ఏదో పెద్ద డ్యాన్సర్‌ని కాదు.

భవిష్యత్తులో బాద్‌షాతో పూర్తి స్థాయిలో సినిమా చేసే అవకాశం ఉందంటారా?

ఉండచ్చేమో! షారూఖ్‌ సార్‌తో చేయాలని ఎవరికి ఉండదు? సినిమా మొత్తం ఆయనతో చేయాలన్న కోరిక నాకూ ఉంది. బహుశా అది వచ్చే సంవత్సరం నెరవేరుతుందేమో చూడాలి.

మిసెస్‌ గౌరీఖాన్‌ మీ పాటను చూశారా?

చూడడమే కాదు, మెచ్చుకున్నారు కూడా! ఓ మహిళ నా డ్యాన్స్‌ను చూసి మెచ్చుకున్నారంటే నేను నూటికి నూరు శాతం పాసైనట్టే! ఒక వర్గానికి నా డ్యాన్స్‌ నచ్చదేమో అన్న అనుమానం ఉండేది. గౌరీఖాన్‌గారి కాంప్లిమెంట్‌తో అది తీరిపోయింది. ‘రాయీస్’లో నా డ్యాన్స్‌ యూతకి మాత్రమే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులకి తప్పకుండా నచ్చి తీరుతుంది.

2016 ఎలా గడిచింది?

అప్‌ అండ్‌ డౌన్స్‌ చాలా ఉన్నాయి. జీవితం అంటే అదే కదా! కెరీర్‌ పరంగా ఎలా ఉన్నా, ఓ సంఘటన ఈ సంవత్సరం నాకు అంతులేని సంతోషాన్ని మిగిల్చింది. మా బ్రదర్‌ ఇన్ని రోజులకి పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. నా కష్టం సుఖంలో ఎప్పుడూ నాకు తోడు నీడగా ఉంటాడు. ఇన్ని రోజులకి వాడికి ఓ ఫ్యామిలీ ఏర్పడిందంటే నాకు అంతకు మించి సంతోషం ఏముంటుంది. మా ఫాదర్‌, మదర్‌ ఇద్దరూ లేరు. నాకు వాడు, వాడికి నేను. వాడి జీవితంలో ఓ గొప్ప మలుపు తీసుకొచ్చిన ఈ సంవత్సరం నాకు మరిచిపోలేని సంవత్సరంగా మిగిలిపోయింది.

సన్నీలియోన్‌ వలన యువత చెడిపోతోంది అంటున్నారు దానికి మీ జవాబు?

నేను పోర్న్‌ స్టార్‌ని నిజమే! ఆ విషయం నేనేమీ దాచిపెట్టలేదు. ఆ పదాన్ని పట్టుకుని నన్ను ఎంత ఇన్‌సల్ట్‌ చేశారో నాకు తెలుసు. హీరోయిన్‌ ముసుగులో ఎంత అసభ్యంగా డ్రస్‌ చేసుకున్నా ఫర్వాలేదు. అదే నేను వేసుకుంటే ఎవరినో చెడగొడుతున్నాను అంటున్నారు. నా సినిమాలు కానీ, నా వీడియోలు కానీ చూడమని ఎవర్నీ బలవంత పెట్టలేదు. ఎవరైతే చెడిపోతున్నారో వారిని నా సినిమాలు కానీ, వీడియోలు కానీ చూడవద్దని చెప్పండి, బాగుపడతారేమో! బాలీవుడ్‌లోనే ఇలాంటి వాతావరణం చూస్తున్నాను. హాలీవుడ్‌లో పరిస్థితి ఇలా ఉండదు. పోర్న్‌ స్టార్‌ని అయినా అక్కడ చాలా గౌరవం ఇస్తారు. ఇక్కడకొచ్చేసరికి నేనేదో చేయకూడని పని చేస్తున్నట్టు ఫీలవుతున్నారు. చెడ్డతనం అనేది నా సినిమాలు, వీడియోల్లో లేదు. మనుషుల బుర్రల్లోనూ, వారి ఆలోచనల్లోనూ ఉంది. నన్ను మారమని చెప్పడం కన్నా వారిని ముందు మారమని చెప్పండి. బాలీవుడ్‌కి వచ్చి ఐదు సంవత్సరాలు అయిపోయినా నన్ను ఇంకా పోర్న్‌ స్టార్‌గానే గుర్తిస్తున్నారు తప్ప నటిగా గుర్తించడం లేదు. ఇదే అప్పుడప్పుడు బాధపెడుతూ ఉంటుంది. పోర్న్‌ స్టార్‌గా ఉన్నప్పుడు కూడా ఇంత బాధ పడలేదు.

డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నారని అన్నారట?

నిజమే! సినిమాల్లోకి వచ్చింది డబ్బు కోసం కాక ఎవరినో ఉద్ధరించడానికి రాలేదు. డబ్బు ఇస్తేనే సినిమాలు చేస్తాను. నా చేత ఫ్రీగా సినిమాలు చేయించుకునే ఆలోచన దర్శకనిర్మాతలకు ఉందేమో నాకు తెలియదు కానీ, నాకు మాత్రం అలాంటి ఆలోచన లేదు.

Leave a Reply