పన్నీర్ సీటుకు శశికళ ఎసరు..!

పన్నీర్ సీటుకు శశికళ ఎసరు..!

జయలలితను తలపిస్తూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శశికళ.. ఇప్పుడు ఏకంగా సీఎం పీఠంపైనే కన్నేశారు. పరోక్షంగా చక్రం తిప్పడంలో ఆరితేరిపోయిన చిన్నమ్మ.. ఇప్పుడు పన్నీర్ పీఠానికి ఎసరు పెడుతున్నారు. తాను డైరక్ట్ గా చెప్పకుండా మంత్రులతో చెప్పిస్తున్నారు.

మొన్నటివరకూ అన్నాడీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రమే చిన్నమ్మ సీఎం కావాలని డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు పన్నీర్ క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా చిన్నమ్మకు సీఎం అయ్యే సత్తా ఉందంటున్నారు. ఆలస్యం చేయకుండా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని కోరుతున్నారు.

జయ తర్వాత సమర్థవంతమైన పాలన అందించే సత్తా చిన్నమ్మకే ఉందంటున్నారు మంత్రులు. మెరీనా బీచ్ లో అమ్మ సమాధి దగ్గర నివాళులు అర్పించిన మంత్రులు ఆర్పీ ఉదయ్ కుమార్, కడంబూరు రాజు, సేవూరు రామచంద్రనలు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ విషయం చెప్పారు.

పన్నీర్ సెల్వం మర్యాదగా సీఎం పదవి త్యాగం చేస్తే సరే.. లేదంటే తామే బలవంతంగా దించేస్తామన్నట్లుగా అన్నాడీఎంకే మంత్రులు, నేతలు ప్లాన్ చేస్తున్నారు. శశికళ మంత్రాంగాన్ని పన్నీర్ సైలంట్ గా చూడటం మినహా ఏమీ చేయలేకపోతున్నారు. ఇక పన్నీర్ రాజీనామా ఖాయమే. అయితే ముహూర్తం ఎప్పుడన్నదే తేలాల్సి ఉంది.

Leave a Reply