పేరు మార్చుకున్న బాల‌య్య‌!

పేరు మార్చుకున్న బాల‌య్య‌!

టాలీవుడ్ టాప్ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ త‌న పేరును మార్చేసుకున్నారు. సినీ న‌టుడిగానే కాకుండా ఇటీవ‌లే రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేసిన బాల‌య్య‌… అనంత‌పురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోక‌వ‌ర్గ ఎమ్మెల్యేగానూ ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌ల త‌న 100వ చిత్రంగా గౌత‌మీపుత్ర శాతక‌ర్ణితో బిజీబిజీగా ఉన్న బాల‌య్య‌… ఆ చిత్రం షూటింగ్ పూర్తి కావ‌డంతో కాస్తంత రిలాక్స్ అవుతున్నారు. ఈ నెల 12న సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని ఆ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ క్ర‌మంలో నేటి ఉద‌యం ఆయ‌న తెలంగాణ సీఎం కేసీఆర్‌ను క‌లిశారు. త‌న తాజా చిత్రం గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం ప్రివ్యూకు హాజ‌రుకావాల‌ని ఆయ‌న కేసీఆర్‌కు ఆహ్వానం అందించారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్స‌వానికి కేసీఆర్ హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ప‌నిలో ప‌నిగా బ‌స‌వ‌తారకం కేన్స‌ర్ ఆసుప‌త్రికి అన్ని ర‌కాలుగా ప్రోత్సాహాలు అందించిన కేసీఆర్‌కు బాల‌య్య కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.

ఆ త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన బాల‌య్య‌… మీడియాతో మాట్లాడుతూ త‌న పేరును మార్చుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతేకాకుండా… ఇక‌పై త‌న‌ను కొత్త పేరుతోనే పిల‌వాలంటూ మీడియా ప్ర‌తినిధుల‌తో పాటు త‌న శ్రేయోభిలాషుల‌ను కూడా ఆయ‌న కోరారు. అయినా బాల‌య్య కొత్త పేరేమిట‌నేగా మీ డౌటు? ఆ పేరు… బ‌స‌వ‌తార‌క రామ పుత్ర బాల‌కృష్ణ. త‌న పాత పేరును కాద‌ని ఈ కొత్త పేరు పెట్టుకోవ‌డానికి కూడా బాల‌య్య కార‌ణం చెప్పేశారు.

ఆ కార‌ణం ఆయ‌న మాటల్లోనే… ఈ భూ ప్ర‌పంచంలో మ‌హిళా శ‌క్తికి స‌మాన‌మైన‌దేదీ లేదు. నాకు మా అమ్మే ఆద‌ర్శం. ఈ కార‌ణంగానే నా పేరుకు ముందు మా అమ్మ పేరును చేర్చుకుంటున్నా. ఇక‌పై ఈ పేరుతోనే న‌న్ను పిల‌వండి… అని బాల‌య్య పేర్కొన్నారు.

Leave a Reply