బాలయ్యకు రాసినోడే చిరుకు కూడా..

బాలయ్యకు రాసినోడే చిరుకు కూడా..

బాలయ్యకు రాసినోడే చిరుకు కూడా : త్రివిక్రమ్ శ్రీనివాస్.. కోన వెంకట్‌ల తర్వాత రచయితగా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న రైటర్ అంటే సాయిమాధవ్ బుర్రానే. కృష్ణం వందే జగద్గురుం.. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు.. కంచె లాంటి సినిమాలతో మాటల రచయితగా గొప్ప పేరే సంపాదించాడు సాయిమాధవ్. ఇప్పుడు ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి చారిత్రక చిత్రంలో ఆయన కలం పదును ఎలా ఉంటుందో చూద్దామని అందరరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఐతే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో పాటు తాను చిరు సినిమా ‘ఖైదీ నెంబర్ 150’కి కూడా కొన్ని మాటలు రాసినట్లుగా సాయిమాధవ్ వెల్లడించాడు. పవన్ కళ్యాణ్ సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు మాట సాయం చేసినట్లే.. ‘150’కి కూడా సాయిమాధవ్ తన వంతు తోడ్పాటు అందించాడట.

దీనిపై సాయిమాధవ్ ఏమన్నాడంటే ”గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి లాంటి సినిమాకు పని చేయడం నా అదృష్టం. ఈ సినిమాకు మాటలు రాయడం సవాలే. పాతికేళ్ల నాటి తెలుగులో మాట్లాడితేనే ఎవ‌రికీ అర్థం కాదు. అలాంటి మొదటి శ‌తాబ్దంలో భాష‌ను ఎలా వాడతాం. కాబ‌ట్టి అంద‌మైన తెలుగులో.. అంద‌రికీ అర్థ‌మ‌య్యే తెలుగులోనే మాటలు రాశాను. ఈ సినిమాతో పాటు ‘ఖైదీ నంబ‌ర్ 150’ సినిమాకు కూడా కొన్ని డైలాగ్స్ నేను రాశాను. ఒకే సమయంలో రెండు భిన్నమైన సినిమాలకు పని చేశాను. ఈ రెండు సినిమాలూ సంక్రాంతికి విడుద‌ల కానున్నాయి.

ఈ రెండూ ప్రెస్టీజియ‌స్ మూవీస్ కావ‌డం ఇంకా గొప్ప‌గా ఉంది. ఐతే ఈ సినిమాల పోటీ విషయంలో నెగెటివ్‌గా ఆలోచించకూడదు. వార్ వ‌న్ సైడ్ అయింది లాంటి మాట‌ల్ని నేను ప‌ట్టించుకోను. సినిమాను ఒక వ్య‌క్తితో ముడిపెట్టి చూడకూడదు. ఎందుకంటే సినిమా అనేది ఒక వ్యవస్థ. కొన్ని వంద‌ల మంది క‌ష్టం ఉంటుంది. కాబ‌ట్టి నేను ప‌నిచేసినా.. చేయ‌క‌పోయినా అన్ని సినిమాలు బాగా ఆడాలన్నది నా అభిమతం” అని సాయిమాధవ్ చెప్పాడు.

Leave a Reply