వోడాఫోన్ నుంచి మరో బంపర్ ఆఫర్

వోడాఫోన్ నుంచి మరో బంపర్ ఆఫర్

రిలయన్స్‌ జియో నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోవడానికి ఇతర నెట్‌వర్క్‌లు జనాకర్షక ప్లాన్స్ ప్రకటిస్తుంటే, వొడాఫోన్‌ కూడా వారి దారిలోనే నడుస్తోంది. ఇప్పటికే అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఆఫర్ ప్రకటించిన వోడాఫోన్ మరిన్ని సరికొత్త ప్యాక్‌లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. వోడాఫోన్ తాజాగా ప్రిపెయిడ్ కస్టమర్ల కోసం ‘సూపర్ అవర్’ పేరిట ఒక ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో రూ. 16, రూ. 7, రూ.5 ప్యాక్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

‘‘రూ. 16తో రిచార్జ్ చేసుకుంటే ఒక గంట పాటు అన్‌లిమిటెడ్ 3జీ/4జీ డేటా వాడుకోవచ్చు. ఈ ప్యాక్‌తో రిచార్జ్ చేసుకుంటే ఫుల్ స్పీడ్‌తో ఒక గంటలోపు ఎంతైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఒక రోజులో ఎన్నిసార్లయిన రిచార్జ్ చేసుకోవచ్చు(24 గంటల్లో 24 సార్లు). ఈ వన్ అవర్ ప్లాన్లతో ఎవ్రీ అవర్ సూపర్ అవర్ అవుతుంది’’ అని వోడాఫోన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సందీప్ కటారియా అన్నారు. అయితే సర్కిల్‌ను బట్టి ప్లాన్ రేటు మారుతుందని తెలిపారు.

అంతేకాదు రూ. 5తో రిచార్జ్ చేసుకుంటే ఒక గంటపాటు అన్‌లిమిటెడ్ 2జీ డేటా, రూ.7తో రిచార్జ్ చేసుకుంటే ఒక గంట పాటు వోడాఫోన్ టూ వోడాఫోన్ అన్‌లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లను ఈరోజు అధికారికంగా లాంఛ్ చేయనున్నారు. అయితే ఈనెల 9వ తేదీ నుంచి ప్లాన్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ఆఫర్ బిహార్-జార్ఖాండ్, మధ్యప్రదేశ్-చత్తీస్‌గఢ్, పంజాబ్-హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కాశ్మీర్, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ సర్కిల్స్‌లో మాత్రం అందుబాటులో ఉండదని వోడాఫోన్ కంపెనీ వెల్లడించింది.

Leave a Reply