హైద్రాబాద్ బిర్యానీ ప్రియులకు షాకింగ్ న్యూస్

హైద్రాబాద్ బిర్యానీ ప్రియులకు షాకింగ్ న్యూస్

భాగ్యనగరంలో ఫేమస్ ఏంటి అనే ప్రశ్న పూర్తయ్యేలోపే వచ్చే సమాధానం బిర్యానీ. హైద్రాబాద్ బిర్యానీ అంటే పెద్ద పెద్ద సెలబ్రెటీలు, క్రికెట్ స్టార్లే లొట్టలేసుకుంటూ తింటారు. ఆదివారం వచ్చిందంటే చాలు నగరవాసులు చాలామంది రెస్టారెంట్లలో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీతో డిన్నర్ చేస్తుంటారు. అంతలా నాన్‌వెజ్ ప్రియులకు పసందైన విందునందిస్తున్న రెస్టారెంట్లు ఈ మధ్య సొంత ప్రయోజనాల కోసం అడ్డదార్లు తొక్కుతున్నాయి. జంతువుల కొవ్వుతో చేసిన నూనెతో బిర్యానీ తయారుచేస్తూ గతంలో అనేక హోటల్స్, రెస్టారెంట్స్ అడ్డంగా బుక్కైన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వెలుగులోకొచ్చిన విషయం గురించి తెలిస్తే రెస్టారెంట్లకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడతారు.

గత వారం నగరంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ సానిటరీ వింగ్ ఆధ్వర్యంలో దాదాపు 500లకు పైగా రెస్టారెంట్స్‌పై ఆకస్మిక తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో 15 రెస్టారెంట్లు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నట్లు తెలుస్తోంది. 10రోజుల క్రితం మాంసాన్ని తెచ్చి ఫ్రిజ్‌ల్లో నిల్వ ఉంచి, దానితో తయారైన బిర్యానీని రోజూ వడ్డిస్తున్నట్లు తనిఖీల్లో వెలుగుచూసింది. దీంతో సదరు అధికారులు కంగుతిన్నారు. ఇలా బిర్యానీ ప్రియులకు వడ్డించే ఫుడ్‌‌ను కనీసం డీప్ ఫ్రిజ్‌లో కూడా పెట్టకుండా ఉన్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సికింద్రాబాద్ సమీపంలో ఉన్న తిరుమలగిరి ప్రాంతంలో షాహి బిర్యానీ దర్బార్ అనే ఫేమస్ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్‌లో తనిఖీలు చేయగా బిర్యానీకి తయారుచేసే మాంసంలో ఫంగస్ చేరినట్లు తెలిసింది. ఈ రెస్టారెంట్ యజమాని చికెన్, మటన్, సీఫుడ్‌ను బల్క్‌లో తక్కువ ధరకు కొని 10రోజుల పాటు నిల్వ చేసినట్లు తేలింది. అంతేకాదు, ఆ రూమ్‌లోకెళ్లి ఫ్రిజ్ ఓపెన్ చేయగానే దుర్వాసన వచ్చినట్లు సానిటరీ వింగ్ ఆఫీసర్ ఎమ్. దేవేందర్ తెలిపారు. మారేడ్‌పల్లిలోని నార్త్ ఇండియన్ రెస్టారెంట్‌లో కూడా సేమ్ సీన్. తక్కువ ధరకు వస్తుందని బల్క్‌లో మాంసాన్ని కొని నిల్వ ఉంచి, దానితో బిర్యానీని తయారుచేసి వడ్డిస్తున్నారు. దీంతో ప్రజలు రోగాల పాలవుతున్నారు.

అంతేకాదు, మారేడ్‌పల్లిలోని ఓ జ్యూస్ సెంటర్‌లో కూడా తనిఖీలు చేశారు. అక్కడ కూడా అదే పరిస్థితి. తక్కువ ధరకు వస్తున్నాయని నాసి రకం పండ్లను కొని, నిల్వ ఉంచి వాటితో జ్యూస్ తయారుచేసి అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తనిఖీలు జరిపిన ఈ 15 రెస్టారెంట్లను తాత్కాలికంగా సీజ్ చేశారు. 10రోజుల లోపు లోపాలను సరిదిద్దుకోపోతే శాశ్వతంగా మూసివేస్తామని అధికారులు హెచ్చరించారు.

Leave a Reply